ప్రస్తుతం కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదు కానీ.. దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ వ్యాఖ్యలు

-

చైనా, అమెరికా వంటి దేశాల్లో మళ్లీ కరోనా ఘంటికలు మోగుతున్న వేళ భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలో దిల్లీ ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్‌ కేసుల్లో పెరుగుదల లేకపోయినప్పటికీ.. అందరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచించారు. ‘‘కరోనా కేసులు ఎక్కడా పెరగట్లేదు. కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. సరైన నిఘా అవసరం. అలా ఉంటేనే ఎక్కడైనా కేసులు పెరిగితే వీలైనంత త్వరగా పరీక్షలు నిర్వహించి వైరస్‌ని నియంత్రించగలం. కొత్త వేరియంట్‌లను గుర్తించి ఇన్ఫెక్షన్‌ మరింత వ్యాప్తి చెందకుండా చూడగలం. చైనాతో పోలిస్తే మన దగ్గర పరిస్థితి చాలా మెరుగ్గానే ఉంది. ఎందుకంటే మనం భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశాం. అధిక ముప్పు ఉన్నవారిలో అధిక శాతం మంది బూస్టర్‌ డోసులూ తీసుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు, చైనాలో కఠిన ఆంక్షలు అమలుచేసినప్పటికీ అక్కడ వైరస్‌ విజృంభణకు కారణం ఒమిక్రాన్‌ ఉపరకమైన బీఎఫ్‌7 అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా ఆ వేరియంట్‌ భారత్‌లోనూవ్యాప్తి చెందింది. గుజరాత్‌లో తొలి కేసు నమోదైనట్టు బయోటెక్నాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ అక్టోబర్‌లోనే గుర్తించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఈ రకం కేసులు మూడు వరకు నమోదైనట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version