తెలంగాణ ఆర్టీసీ రోజుకో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతూ ప్రయాణికులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఆఫర్లు, డిస్కౌంట్లతో ప్రయాణికుల సంఖ్యను పెంచుకుంటూ లాభాల పడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునేప్పుడు చిల్లర సమస్యతో కండక్టర్లు, ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ ఓ యోచన చేసింది. బస్ టికెట్ల ధరలను రూ.10, 15, 20… ఇలా రౌండ్‌ఫిగర్‌గా మార్చేసింది. అయినా చిల్లర సమస్య పరిష్కారం కాలేదు. ఇందుకోసం మరో ఉపాయం ఆలోచించింది ఆర్టీసీ.
తాజాగా ఆర్టీసీ నగదు రహిత చెల్లింపు విధానాన్ని తీసుకువచ్చే యోచనలో ఉంది. ఇందులో భాగంగానే పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సహా ఆపైస్థాయి బస్సులన్నింట్లో ఐ-టిమ్స్ పరికరాలను అందుబాటులోకి తెస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోపాటు ఫోన్‌పే, గూగుల్‌పే వంటి వాటితో చెల్లింపులు చేయొచ్చు.
ఈ మేరకు బండ్లగూడ బస్ డిపోను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు ఆర్టీసీ అధికారులు. డిపోలోని ఆర్డినరీ, మెట్రో సహా మొత్తం 145 బస్సుల్లో ఐ-టిమ్స్‌ను వాడేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత కంటోన్మెంట్ డిపోలో అమలు చేయనున్నారు. వీటి ఫలితాల ఆధారంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,300 బస్సుల్లో దశలవారీగా ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు.