కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మరో 45 రోజులలో అసెంబ్లీ రద్దు కానుందని.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పతనం మొదలైందని అన్నారు కోమటిరెడ్డి.
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ ని వీడిన వాళ్లంతా తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఇక పార్టీలో గ్రూపు రాజకీయాలు చేయవద్దని కార్యకర్తలను కోరారు. నియోజకవర్గాలలో ఇద్దరు సమాన స్థాయి నాయకులే ఉంటే ఒకరికి ఎమ్మెల్యే టికెట్, మరొకరికి ఎమ్మెల్సీ లేదా జడ్పీ చైర్మన్ ఇప్పించే బాధ్యత పార్టీ సీనియర్ నేతగా తాను తీసుకుంటానని చెప్పారు. ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా అండగా ఉంటున్నానని తెలిపారు.