దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టడం శుభపరిణామం అని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉగాది రోజున ప్రారంభించినట్టు వెల్లడించారు.
ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు సన్నబియ్యం చేరాయని తెలిపారు. రేషన్ కార్డు హుస్నాబాద్ లో ఉండి హైదరాబాద్ లో నివసిస్తున్న వారు కూడా తీసుకోవచ్చని తెలిపారు. 2024-25, 2025-26 సంవత్సరానికి సంబందించిన ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని.. ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే కార్యదర్శి ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి తెలిపారు.