టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దు అంటూ వివాహిత సూసైట్ నోట్ కలకలం రేపింది. హైదరాబాద్-కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధి తులసీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోయి అనూష అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అనూష స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కంచుస్తంభం. ఐదేళ్ల క్రితం వెంకన్న అనే వ్యక్తితో అనూష వివాహం జరిగింది. ఇక వీరికి నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు.
టెలిగ్రామ్ యాప్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రకటన చూసి మొదట రూ.1000 కట్టింది బాధితురాలు. ఏడు వేలు లాభం వచ్చినట్టు యాప్‌లో కనిపిస్తున్నప్పటికీ.. బ్యాంక్ ఖాతాలోకి బదిలీ కాలేదని తర్వాత గ్రహించింది అనూష. సైబర్ నేరగాళ్లు చెప్పిన మరిన్ని టాస్క్‌లు పూర్తి చేయడానికి ఇంట్లో ఉన్న బంగారాన్ని సైతం అమ్మి దాదాపు రూ.లక్ష పెట్టుబడి పెట్టింది అనూష. ఇక మోసపోయానని గ్రహించి.. మంగళవారం రాత్రి తన నివాసంలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తనలా ఎవరూ టెలిగ్రామ్ యాప్ వలలో పడి మోసపోవద్దని.. బాబు జాగ్రత్త అంటూ సూసైడ్ లెటర్ రాసింది.