పేదలు ఆత్మగౌరవంతో బతికాలనే ఉద్దేశంతో తెలంగామ సర్కార్ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి విడతల వారీగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో దాదాపు 10 వేల కోట్లు వెచ్చించి అన్నిసౌకర్యాలతో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా తొలివిడతలో ఎన్ఐసీ రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా.. ర్యాండమైజేషన్ పద్దతిలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించారు. 11వేల 700 మంది లబ్దిదారులను ఎంపిక చేసి ఈనెల 2న 8ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఇళ్లు పంపిణీ చేశారు.
ఈనెల 15 న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఆన్‌లైన్ డ్రా నిర్వహించి 13వేల300 మంది లబ్దిదారులను ఎంపికచేశారు. డ్రా లో ఎంపికైన లబ్దిదారులకు నేడు 9 ప్రాంతాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఇండ్లను పంపిణీ చేయనున్నారు. దుండిగల్‌లో 2,100 మంది లబ్ధిదారులకు ఇళ్లను కేటీఆర్ అందించనున్నారు. కొల్లూరు- 2 లో 4,800 ఇళ్లను మంత్రి హరీశ్‌రావు, తట్టి అన్నారంలో 1,268 ఇళ్లను మంత్రి మహమూద్ అలీ, చర్లపల్లిలో 1,000 ఇళ్లను మంత్రి తలసాని, జవహర్‌నగర్- 3 లో 1,200 ఇళ్లను మంత్రి మల్లారెడ్డి అందించనున్నారు.
మరోవైపు మహేశ్వరం నియోజకవర్గంలో 700 ఇళ్లను మంత్రి సబిత, అట్టిగూడలో 432 ఇళ్లను మంత్రి మహేందర్‌రెడ్డి, తిమ్మాయిగూడలో 600 ఇళ్లనుమేయర్ విజయలక్ష్మి, మేడ్చల్ జిల్లా ప్రతాప సింగారంలో 1,100 మందికి డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఇళ్లను పంపిణీ చేయనున్నారు.