ఏపీలో ఇటీవల తిరుమల కొండపై డ్రోన్లు, విమానాలు ఎగరడం తీవ్ర వివాదానికి దారి తీస్తున్న విషయం తెలిసిందే. తిరుమలేశుడి ఆలయంపై నుంచి ఇప్పటికే చాలాసార్లు విమానం ఎగిరింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణకు కూడా వచ్చింది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన పవిత్ర పుణ్య క్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంపై డ్రోన్ కెమెరా ఎగురుతూ కనిపించడం కలకలం రేపింది. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరవేయడాన్ని గమనించిన SPF అధికారులు, సిబ్బంది డ్రోన్ ఎగురవేసిన ఇద్దరు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎల్లపు నాగేంద్రబాబు, ఎల్లపు నాగరాజు అనే ఇద్దరు యువకులు యూట్యూబర్స్‌గా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం యాదగిరిగుట్టకు చేరుకున్న వీరిద్దరూ కొండ దిగి పార్కింగ్ స్థలం నుంచి డ్రోన్ కెమెరాను ఎగరవేసి ఆలయ పరిసరాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన ఎస్పీఎఫ్ సిబ్బంది… ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను స్థానిక పోలీసులకు అప్పగించారు.