టీచర్ దాష్టీకం.. మత్తులో తూలాడు.. నవ్వినందుకు కొట్టాడు

-

గురువులంటే ఒకప్పుడు విద్యార్థులకు ఎంతో గౌరవం ఉండేది. ఆ గౌరవానికి తగ్గట్లు గురువుల ప్రవర్తన ఉండేది. వారి మార్గదర్శకంలో విద్యార్థులు తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకునేవారు. కానీ నేటి తరంలో కొందరు గురువులు ఆ స్థాయిని తగ్గించేలా ప్రవర్తిస్తున్నారు. కొందరు మందు తాగి స్కూల్‌కు వస్తున్నారు. మరికొందరేమో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరేమో క్రమశిక్ష నేర్పించడమంటే శిక్షించడమని అర్థమనే భావనలో విద్యార్థులను చితక్కొడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయేలా హింసిస్తున్నారు.

మద్యం తాగి పాఠశాలలో మత్తుతో ఊగుతుండగా చూసి నవ్వినందుకు ముగ్గురు విద్యార్థినులపై చేయి చేసుకున్నాడు ఓ ఉపాధ్యాయుడు. ఇందులో ఓ బాలిక మెడనొప్పితో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం సమీపంలోని మత్యాలమ్మగూడెం గిరిజన బాలిక ఆశ్రమ పాఠశాలలో జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని ప్రవళిక తెలిపిన వివరాల ప్రకారం..

ముత్యాలమ్మగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. మత్తులో ఊగుతున్న అతనిని చూసి విద్యార్థినులు నవ్వడంతో కోపం తెచ్చుకుని ముగ్గురిపై చేయి చేసుకున్నాడు. ముగ్గురిలో 7వ తరగతి చదువుతున్న ప్రవళిక మెడపై బలమైన దెబ్బ తగిలింది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌కు చెప్పడంతో తగ్గుతుందిలే.. ఎవరికీ చెప్పవద్దంటూ మాత్ర ఇచ్చారు.

బుధవారం ఉదయం మెడపై నొప్పి వస్తుండటంతో విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version