తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాల కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద దీనిపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్‌కు హైదరాబాద్‌లోని ఈడీ జోనల్ కార్యాలయం సంయుక్త సంచాలకుడు లేఖ రాశారు.
గొర్రెల కొనుగోళ్ల పేరిట దాదాపు రూ.700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్టు చేసి విచారణ చేస్తోంది. అయితే మనీలాండరింగ్ కోణంలో ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది. గొర్రెల కొనుగోళ్ల కోసం సమాఖ్య నుంచి ఏయే జిల్లాల అధికారుల ఖాతాల్లో నిధులు జమ చేశారో వారి వివరాలు, ఆయా బ్యాంకు ఖాతాల సమాచారం, లబ్ధిదారుల వాటాగా జమ చేసిన నిధులు, ఏయే ఖాతాల్లో జమ అయ్యాయి? సమగ్ర వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది.