ఒడిశాలో మోహన్ చరణ మాఝి నేతృత్వంలో తొలిసారి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చింది. ఈ సర్కార్ మొదటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా గురువారం ఉదయం పూరీలోని జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరిపించింది. అనంతరం సీఎం మోహన్ చరణ మాఝితోపాటు కేబినెట్ మంత్రులంతా జగన్నాథ స్వామి దర్శనం చేసుకున్నారు.
ఐదేళ్ల తర్వాత ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో ఆలయ నాలుగు ద్వారాలను అధికారులు ఈరోజు తెరిచారు. అన్ని ద్వారాల గుండా భక్తులు ఆలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆలయ నాలుగు ద్వారాలు తెరవడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం మోహన్ చరణ్ మాట్లాడుతూ.. కేబినెట్ తొలి సమావేశంలో జగన్నాథ ఆలయ నాలుగు ద్వారాలను తెరవాలని నిర్ణయించామని.. ఉదయం 6:30 గంటలకు తనతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంగళ హారతికి హాజరయ్యారని తెలిపారు. జగన్నాథ దేవాలయ అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.