రైతుల ఉచిత కరెంట్ పై తాను అమెరికాలో మాట్లాడిన వీడియోను ఎడిట్ చేశారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ చిల్లర ప్రయత్నాలు చేసిందని, బిఆర్ఎస్ నేతలు తనను నిందించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులను పొట్టన పెట్టుకున్నది సీఎం కేసీఆర్ అని అన్నారు. 2009లో ఏడు గంటలుగా ఉన్న ఉచిత కరెంట్ ను 9 గంటలకు పెంచింది కాంగ్రెస్ పార్టీనే అని గుర్తు చేశారు.
తనతో పొలంలో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ కి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తాను వ్యవసాయం చేశానని, నాగలి కట్టానని.. తనతో పొలంలో కేటీఆర్ పోటీ పడగలరా..? అని ప్రశ్నించారు. తాను ఓ రైతుబిడ్డనని.. కేటీఆర్ లాగా అమెరికాలో పనిచేయలేదని అన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మాట వినకుండా అధిక రేటుకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయాన్ని పండగ చేసింది, రైతులను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.