మొన్నటిదాక టమాట.. ఆ తర్వాత ఉల్లిగడ్డ కొనాలంటే సామాన్యుడి భయపడిపోయాడు. ఇక ఇప్పుడు కోడిగడ్డు వంతు వచ్చింది. రోజురోజుకు కోడిగుడ్డు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కార్తికమాసం ముగిశాక గుడ్ల వినియోగం, ధర పెరుగుతున్నాయి. గత నెలలో ఒక్కో గుడ్డు ధర రూ.5.50 ఉండగా వారం రోజుల క్రితం రూ.6కు చేరుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా రూ.7కి పెరిగింది.
వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా రూ.72 నుంచి రూ.84కు చేరడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.5.76 ఉంది. కోడిగుడ్ల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. రాష్ట్రంలో ఏటా 17.67 బిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. గత 20 రోజులుగా చలి పెరగడంతో కోళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని, ఫలితంగా గుడ్ల ఉత్పత్తి బాగా తగ్గిందని పెంపకందారులు అంటున్నారు. మరోవైపు, దాణా ఛార్జీలు పెరగడం, వాహనదారులు గత రెండు నెలల్లో రవాణా ఖర్చులు 15 శాతం పెంచడం వల్ల గుడ్ల ధర పెరిగిందని పౌల్ట్రీవర్గాలు తెలిపాయి.