కరీంనగర్: వడగళ్ళ వర్షానికి నష్టపోయిన పంటను పరిశీలించారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు కన్నీళ్లను తుడిచేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. ప్రతి కౌలు రైతును తెలంగాణ ప్రభుత్వం ఆదుకొని వారి అకౌంట్లో పంట నష్టపరిహారం ఇస్తుందన్నారు గంగుల. అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అకాల వర్షాలు కురిసాయని.. 6 గ్రామాల్లో 5 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వివరించారు.
ఇటువంటి సమయంలో రైతులు మనోధైర్యం తో ఉండాలన్నారు. సీఎం కెసిఆర్ ముందు చూపుతో ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించామన్నారు మంత్రి గంగుల కమలాకర్. సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారులను అప్రమత్తం చేసామన్నారు. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని.. ఇప్పటికే సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రకృతి సహరించక పోయినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చేతికొచ్చిన పంట నష్టం పోవడం చాలా బాధాకరం అన్నారు.