చెంచు ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లికి చెందిన బాధితురాలిని, ఆమె కుంటుంబాన్ని సోమవారం మంత్రి జూపల్లితో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులను ఇప్పటికే రిమాండ్ చేశారని చెప్పారు. పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామని, ఆదివాసీ మహిళను, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించి, ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇది అన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బాధితురాలను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని వివరించారు. ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.