లోక్సభ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీ నుంచి కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి గాంధీభవన్ వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డికి పార్టీ కండువా కప్పిన దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించారు.
గాంధీభవన్‌కు వచ్చే ముందు ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపించారు. సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో దీపాదాస్ మున్షీ సమక్షంలో చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు పర్యాయాలు దేవాదాయ, అటవీశాఖమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.