కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద అవినీతి జరిగిందని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కాళేశ్వరంపై సమీక్ష నిర్వహిస్తే అసలు దోషి బయటపడతారని పేర్కొన్నారు. దేశంలో ఇంత పెద్ద కుంభకోణం చేసిన వ్యక్తి మరొకరు లేరని ఆరోపించారు. 2008లోనే వైఎస్‌ఆర్ హయాంలో కాళేశ్వరంపై సమీక్ష జరిగిందన్న రఘునందన్.. నాడు రూ.17,800 కోట్లతో 160 టీఎంసీలతో ప్రాజెక్టుకు ప్రతిపాదించారని తెలిపారు.
12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రతిపాదన చేసి.. వైఎస్‌ఆర్ హయాంలోనే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు పెంచేలా మరోసారి ప్రతిపాదించారని వెల్లడించారు. మరో 20 టీఎంసీలు పెంచి రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టు చేపట్టేలా ఇంకో ప్రతిపాదన చేసి ప్రాజెక్టు పనుల కోసం గుత్తేదారులకు రూ.11 వేల కోట్లు చెల్లింపులు కూడా జరిగాయని వివరించారు.
“2016లో కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు డిజైన్ మార్చారు. రూ.63 వేల కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్‌కు ప్రతిపాదనలు పెట్టారు. తర్వాత ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచారు. మరోసారి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.05 కోట్లకు పెంచారు. జూన్ నాటికి రూ.1.49 లక్షల కోట్లతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా మెఘా కంపెనీకి రూ.48 వేల కోట్లు లబ్ధి జరిగింది.” అంటూ రఘునందన్ రావు ఆరోపించారు.