రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు. అగ్నిప్రమాదాలపై ఇప్పటికే పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయినా పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బండ్లగూడలోని రత్నదీప్ సెలెక్ట్ సూపర్‌మార్కెట్‌లో ఈరోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సిబ్బంది సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. వేసవి కావడం, గాలులు వీస్తుండటంతో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు యజమానులు చెప్పారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సూపర్ మార్కెట్ లోని సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు.