హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సమయంలో ఒక్కసారిగా నాలుగంతస్తుల భవనంలోని ముందు భాగంలో మంటలు చెలరేగాయి. క్రమంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో భవనం అగ్ని కీలల్లో చిక్కుకుంది. అయితే ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు గంటల పాటు అయిదు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు.
అగ్నిప్రమాదం జరగడానికి కొద్దిసేపటి క్రితమే అక్కడ పనిచేసే సిబ్బంది మాల్ మూసి వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మంటలు ఎగిసిపడడంతో పెద్ద ముప్పు తప్పింది. విద్యుదద్ఘాతం కారణంగానే మంటలు చెలరేగినట్టు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనలోో ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అధికారులు తెలిపారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి భవనం పైకప్పు కూలింది. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టపోయినట్లు మాల్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.