గత నాలుగు నెలలుగా మండిపోతున్న ఎండలకు.. ఉక్కపోతకు.. భాగ్యనగరవాసులు ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత నగరంలో చిరుజల్లులు కురిశాయి. తొలకరి జల్లుతో బుధవారం రోజున హైదరాబాద్ మహానగరం పులకరించింది. తొలి వర్షం కురవడంతో నగర ప్రజలు సంబురపడ్డారు. ఎట్టకేలకు వాన కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఉక్కపోతకు గుడ్ బై చెప్పినట్లేనని సేదతీరారు.
హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం పలుచోట్ల మోస్తరు వర్షాలు పడ్డాయి. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకాఫూల్, సికింద్రాబాద్, పరేడ్ మైదానం తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు, తుంపర్లు పడ్డాయి. అలాగే ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, మల్లేపల్లి, నాంపల్లి, ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కూకట్‌పల్లి ప్రాంతంలో చిరుజల్లులు ఆ ప్రాంతవాసులను పులకరించాయి. నగరంలోని కోఠి, అబిడ్స్, బేగంబజార్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్‌లలో మోస్తరు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీ, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, సంతోష్‌నగర్ వంటి ప్రాంతాల్లో వాన కురిసింది.