వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థతకు గురైతే ఇద్దరు బాలికలను నిమ్స్‌కు తీసుకొచ్చారని వెల్లడించారు. ఎనిమిదో తరగతి బాలిక మహాలక్ష్మి ,తొమ్మిదో తరగతి బాలిక జ్యోతిలను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ తరలించారని తెలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చానన్నారు.
మహాలక్ష్మి కోలుకున్నా జ్యోతి ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచడానికి డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 9వ తరగతి చదువుతున్న శైలజ అనే అమ్మాయి వెంటిలేటర్‌పై చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుందని హరీష్‌రావు వివరించారు. దైర్యంగా ఉండాలని పిల్లల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పా.. పరిస్థితులు అన్నీ మెరుగ్గా ఉంటాయి, ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య రెసిడెన్షియల్ స్కూళ్లలో దొరుకుతుందని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చేర్పిస్తున్నారని తెలిపారు. అయితే గత పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లి తండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు దిగజారాయని మండిపడ్డారు.