దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. నేషనల్ హెరాల్డ్ లో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని అనుమానిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) దీనిపై దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణకి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ అధికారులు ప్రశ్నించారు.
తాజాగా ఈ కేసులో సికింద్రాబాద్ కి చెందిన కాంగ్రెస్ లోక్సభ మాజీ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియా లిమిటెడ్ కు ఇచ్చిన విరాళాల పై అంజన్ కుమార్ స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. అయితే గత నెలలోనే అంజన్ కుమార్ యాదవ్ విచారణకు హాజరవలసి ఉండగా.. అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో నేడు ఈడి ముందుకు వచ్చారు.