తెలంగాణలో భానుడు మహోగ్రరూపం దాల్చాడు. సూర్య ప్రతాపానికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు భగభఘమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 8 జిల్లాల్లో 46 నుంచి 46.6 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.6 డిగ్రీలు రికార్డయింది.
సూర్యాపేట, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, వరంగల్, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో 46 డిగ్రీలపైన, నిర్మల్, గద్వాల, సిరిసిల్ల, యాదాద్రి, ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో 45.1 నుంచి 45.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ దెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఆదివారం వరకు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు పెరిగాయి. 6వ తేదీ నుంచి కొంత ఉపశమనం దొరికే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.