తెలంగాణ నూతన స్పీకర్‌గా మాజీమంత్రి, వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గడువులోగా ఒకే నామినేషన్ రావటంతో ప్రసాద్ కుమార్ ఆయన ఎన్నిక లాంఛనమైంది. అధికార పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆయన అభ్యర్థిత్వానికి బీఆర్ఎస్, ఎంఐఎం మద్దతు తెలిపాయి. స్పీకర్ ఎన్నికను ఇవాళ ప్రోటెం స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం సభాపతితో ప్రొటెం స్పీకర్‌గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేయిస్తారు. తదనంతర ప్రక్రియగా కొత్త ప్రభుత్వంలో శాసనసభా సమావేశాలను ప్రారంభించనున్నారు.
అయితే బుధవారం రోజున స్పీకర్ పదవికి నామినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ప్రక్రియ ముగిసే సమయం వరకు ఒకే ఒక్క దరఖాస్తు నమోదు కావటంతో ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవమైంది. సభాపతిగా బుధవారం మధ్యాహ్నం గడ్డం ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. నాలుగైదు సెట్ల నామినేషన్ పత్రాల్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందడేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులతో పాటు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. అధికార పార్టీ నుంచి ముఖ్యమంత్రి, ప్రతిపక్షం నుంచి కేటీఆర్ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్‌పై సంతకం చేశారు.