రాయదుర్గం-శంషాబాద్‌ మెట్రో ప్రాజెక్టు నిలిపివేతకు సీఎం రేవంత్ ఆదేశాలు

-

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీసిన సీఎం.. ఓఆర్‌ఆర్‌ వెంట జీవో 111 ప్రాంతంలో మెట్రో ఎలైన్‌మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే అక్కడ ఓఆర్‌ఆర్‌ ఉన్న నేపథ్యంలో.. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించాల్సిన మెట్రో టెండర్లను నిలిపివేయాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా ఎలైన్‌మెంట్‌ రూపొందించాలని సూచించారు.

అయితే రాయదుర్గం నుంచి విమానాశ్రయం వరకు మెట్రో లైను నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేసి.. టెండర్లను కూడా పిలిచింది. వాటిని ఆమోదించే దశలో ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వాటి ఖరారుపై నిర్ణయం వాయిదా పడింది. ఈ లైనుకు దాదాపు రూ.6,250 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేయగా.. ఈ మార్గానికి హెచ్‌ఎండీఏ నుంచి రూ.600 కోట్లు ఇస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పడు తాజాగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. శంషాబాద్‌ నుంచి విమానాశ్రయానికి ఓఆర్‌ఆర్‌ ఉండటంతో ఈ కారిడార్‌లో మెట్రో లైను అవసరం లేదని భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version