తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020-21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేటoదుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడంలో రక్త పరీక్ష ఎలా ఉపయోగపడుతుందో నేల పోషకవిలువలు ఆరోగ్యము గురించి తెలుసుకోవడానికి ‘’మట్టి నమూనా పరీక్ష ‘’ అలా ఉపయోగపడ్తుందని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూత పడే స్థితికి వచ్చాయని, వాటిని వెంటనే పునరుద్దరింప చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సివుందని మంత్రి సూచించారు. నేల స్వభావం రైతుకు తెలిసినప్పుడు దానికి తగ్గ పోషకాలను, సేంద్రీయ ఎరువుల ద్వారా, రసాయన ఎరువుల ద్వారా అవసరం మేరకు వాడుకొనే సౌలభ్యం వారికి అందుబాటులోకి తేవడం ద్వారా సాగు ఖర్చును గణనీయంగా తగ్గించవచ్చు అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో 9, ప్రాంతీయ భూసార పరీక్షకేంద్రo ఒకటి, మొబైల్ భూసార పరీక్షా కేంద్రo ఒకటి, వ్యవసాయ మార్కెట్ లలో 14 భూసార పరీక్షా కేంద్రాలున్నాయని, యాసంగి సీజన్ అయిపోవస్తున్నoదున్న, వచ్చే వానాకాలంలోపు మట్టి నమూనాలు సేకరించి ఆయా పరీక్షా కేంద్రాల సామర్ద్ధ్యం అనుసరించి, రైతులకు మట్టి పరీక్ష చేసి ఫలితాలు అందజేసేoదుకు ఏర్పాట్లు చేసే విధంగా ప్రణాళిక చేసుకోవాల్సిందిగా ఆదేశించారు.