తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ని ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ఎక్కడ ఏర్పాటు చేయాలి. ఎంత విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలనే అంశంపై ఇప్పటికే సంబంధిత పరిశ్రమలు, నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించామన్నారు. మాదాపూర్ డ్రోన్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగంలో సుమారు 1800 మందికి ఉపాధి కల్పిస్తున్న ‘సెంటిలియన్ నెట్ వర్క్స్ అండ్ హెచ్సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నూతన క్యాంపస్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొత్త సాంకేతికల ఆవిష్కరణలో తెలంగాణను నంబర్ వన్ గా నిలిచేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రంగాల్లో తెలంగాణ యువతకు స్కిల్స్ యూనివర్సిటీ, పరిశ్రమల సహకారంతో శిక్షణ ఇచ్చి.. ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ లో నిర్మించతలపెట్టిన ఏఐ యూనివర్సిటీకి త్వరలో శంఖుస్థాపన చేయబోతున్నామని అన్నారు. ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.