కొత్త పోస్టుల్లో చేరేందుకు ఇష్టంలేని వీఆర్వోలపై చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకునే యోచనలో ఉన్న ప్రభుత్వం.. ఒక వేళ ఎవరైనా స్వచ్ఛంద పదవీ విరమణ కోరుకుంటే నిబంధనల మేరకు అనుమతి ఇవ్వాలని కూడా నిర్ణయించింది. వీఆర్వోలకు సంబంధించిన అంశంపై ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.
ఇతర శాఖల్లోకి వీఆర్వోల బదలాయింపు ప్రక్రియ పూర్తయిందని, 98శాతం మంది కొత్త పోస్టుల్లో చేరినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 5,137 మందికి గాను 5,014 మంది తమకు కేటాయించిన శాఖల్లో చేరినట్టు పేర్కొన్నారు. జీవో 121ను సవాల్ చేస్తూ పలువురు కోర్టుకు వెళ్లినప్పటికీ.. 19మంది విషయంలో మాత్రం యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు.
అయితే, ఆ 19మందిలోనూ దాదాపు 15 మంది తమకు కేటాయించిన శాఖల్లో చేరినట్టు సమాచారం. వీఆర్వోలను రెవెన్యూశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగించే ప్రసక్తే లేదని.. కేటాయించిన శాఖల్లో తప్పనిసరిగా చేరాల్సిందేనని ఉన్నతస్థాయి సమావేశం మరోమారు స్పష్టం చేసింది.