భద్రాద్రిలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మరో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. మిథిలా మండపంలో శ్రీరాముడు రాజాధిరాజుగా దర్శనమివ్వనున్నారు. ఇవాళ సీతారామచంద్రస్వామి వారి మహాపట్టాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ మహాపట్టాభిషేకానికి గవర్నర్ రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయ పరిసరాల్లో భారీ బందోబస్తు నిర్వహించారు.
మరోవైపు శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం భక్తజనుల జయజయధ్వానాల నడుమ వైభవోపేతంగా సాగింది. ఆలయంలోని మిథిలా మండపంలో బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ మహోత్సవానికి విష్వక్సేనుల ఆరాధన, పుణ్యాహవచనంతో శ్రీకారం చుట్టారు. వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నంలో జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మూడు పతకాలు కలిగిన మాంగల్యాన్ని సీతమ్మ మెడలో ధరింపజేశారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సీఎస్ శాంతికుమారి దంపతులు, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు సమర్పించారు.