శనివారం మధ్యాహ్నం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఈ సందర్భంగా సప్తముఖ మహాశక్తి గణపతికి గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కి ఎమ్మెల్యే దానం నాగేందర్.. శ్రీరాముడి విగ్రహాన్ని అందించారు.
ఇక మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తొమ్మిది రోజులపాటు భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్సవ కమిటీతో పాటు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక జిహెచ్ఎంసి సకల ఏర్పాట్లును కల్పించింది.
ఈ ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో చరిత్ర, ప్రత్యేకత ఉంది. మొదటిసారిగా 1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్ లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తరువాత ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వస్తున్నారు. ఈ ఏడాది 2024లో 70 అడుగుల వినాయకుడి ప్రతిమను సిద్ధం చేశారు. పర్యావరణహితం కోసం మట్టితోనే ఈ గణపతి విగ్రహాన్ని తయారు చేశారు.