జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ లో తొలి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వినాయక చవితి రోజున కశ్మీర్ లో ఆయన బిజెపి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ ని ఉగ్రవాదుల చేతుల్లోకి నెట్టడమే నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్, పీడిపిల లక్ష్యమని ఆరోపించారు. స్వతంత్రం వచ్చిన నాటి నుండి మొదటిసారి ఇక్కడి ఓటర్లు త్రివర్ణ పతాకం నీడలో ఓటు వేయబోతున్నారని అన్నారు అమిత్ షా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనే వరకు పాకిస్తాన్ తో భారత ప్రభుత్వం చర్చలు జరపబోదని స్పష్టం చేశారు.
ఎన్సీ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులు రెచ్చిపోతారని.. ఉగ్రవాదం కావాలా..? శాంతి కావాలా..? కాశ్మీర్ ప్రజలు తేల్చుకోవాలని కోరారు. బిజెపి అధికారంలోకి వస్తే ఉగ్రవాదాన్ని లేకుండా చేస్తామని అన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.