నిరుద్యోగుల అలర్ట్.. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసిన కమిషన్ ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ చేపట్టింది. ఈనెల 4తో ప్రాథమిక కీ అభ్యంతరాల స్వీకరణ పూర్తికాగా, పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం.
అయితే మొత్తంగా ఎన్ని అభ్యంతరాలు వచ్చాయనే విషయాన్ని కమిషన్ వెల్లడించలేదు. మరోవైపు ప్రాథమిక కీ పైన వచ్చిన అభ్యంతరాల పరిశీలనకు టిఎస్పిఎస్సి కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను లోతుగా పరిశీలించాలని నిర్ణయించిన టి.ఎస్.పి.ఎస్.సి ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి తుది కీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని భావిస్తున్న కమిషన్, ఈ ప్రక్రియ ముగిస్తే వచ్చే వారంలో తుది కీని విడుదల చేయనుంది.