పార్టీ ఆదేశిస్తే నా కుమారుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడు : గుత్తా సుఖేందర్ రెడ్డి

-

మరో మూడు, నాలుగు రోజుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే తన కుమారుడు అమిత్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. రాజకీయాల్లో అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి ఎవరూ ఉండరన్న గుత్తా.. అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేయడం వేరు, ఇప్పుడు వేరని పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు పోటీ చేసి కేడర్ను కాపాడుకోవాలన్నదే తమ ఆలోచన అని స్పష్టం చేశారు. 2027 నవంబర్ వరకు తన పదవీ కాలం ఉందని, ఆ తర్వాత మిగతా విషయాలు ఆలోచిస్తానని వెల్లడించారు.

“ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ ఉంటుంది. కేటీఆర్ కలిసినపుడు అమిత్ రెడ్డి టికెట్ అంశం చర్చకు వచ్చింది. మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుంది. అందరికీ సంతృప్తి, వ్యతిరేకత ఉండదు. పార్టీని, కేడర్ ను కాపాడుకోవడం ప్రస్తుత ప్రధాన సమస్య. గాలి వచ్చింది పార్టీ ఓడిపోయింది. వాతావరణం తప్ప ఎవరో వ్యక్తులు కారణం కాదు. అమిత్ రెడ్డి జిల్లా నేతలను అందరినీ కలిశారు. నల్గొండ, భువనగిరిలో ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేస్తారు. పార్టీ అన్ని అంశాలు చూసుకుంటుంది. ఏ ప్రభుత్వం ఉన్నా సీఎం, మంత్రులు చేయాల్సిన పనులు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులను సభా హక్కుల ఉల్లంఘన కమిటీకి పంపుతాను.” అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version