రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన విమర్శలను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తిప్పికొట్టారు. తెలంగాణలోని వ్యవసాయ క్షేత్రాలు, నూతన భవనాలను విమర్శించడం బాధ్యతల్లో ఉన్నవారికి గౌరవం కాదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందన్న గుత్తా.. కళ్లుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారే అనవసర విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
బాధ్యతల్లో ఉన్న కొంత మంది అభివృద్ధిని చూడకపోవడం విచారకరమని గుత్తా సుఖేందర్ వ్యాఖ్యానించారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే జాతీయ రహదార్లకు టోల్ చెల్లిస్తూ తెలంగాణ ప్రజల భాగస్వామ్యం కూడా ఉందని వివరించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం నూటికి నూరు పాళ్లు సుభిక్షంగా ఉందని… రాష్ట్రం, ప్రజలు దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు.
రాజ్భవన్లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ అనంతరం ప్రసంగిస్తూ.. కొత్త భవనాలు నిర్మించడమే అభివృద్ధి కాదని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తాను కొంత మందికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.