రాష్ట్ర వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఆంజనేయ స్వామి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా కొండగట్టు అంజన్న క్షేత్రం సందడిగా మారింది. ఈ క్షేత్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా అంజన్న క్షేత్రంలో హునుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.
చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ చిన్న జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ పెద్ద జయంతిని నిర్వహించనున్నారు. కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి రోజున ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞయాగాదులు నిర్వహించకుండా కేవలం అభిషేకం, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. శ్రీచాత్తాద శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం జయంత్యుత్సవాలను ఆలయ అర్చకులు జరుపుతారు. హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో కొండగట్టు అంజన్న క్షేత్రం నేటి నుంచి 7వ తేదీ వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.