బాసర గురుకులాల దీనస్థితిపై హరీష్ రావు సీరియస్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే, బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ కేజీబీవీ పాఠశాలలో “ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని తీసుకెళ్లండి” అని తల్లిదండ్రులను వేడుకుంటున్న విద్యార్థులు, మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి అన్నారు.
విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారు. ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ ఊదరగొట్టిన మార్పు ఇదేనా? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగు, పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. “ఈ బువ్వ మాకొద్దు, ఇక్కడ మేము ఉండలేము” అని విద్యార్థులు వేడుకుంటున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. .
కన్నబిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకపోతున్నారు…ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? అని ప్రవ్నించారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నీవే ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నావు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది.ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి, విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.