తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ రెంటికీ చెడ్డ రేవడి అవుతారని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవమంటూ మాట్లాడే ఈటల పదవుల కోసం ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి బీజేపీలో చేరారని మండిపడ్డారు. నాడు తెలంగాణ ప్రాంత అభివృద్ధికి నిధులు అడిగితే ఒక్క రూపాయీ ఇవ్వనన్న కిరణ్ కుమార్ రెడ్డిని నేడు ఆ పార్టీ ముఖ్య సలహాదారుగా నియమించుకుందని అన్నారు. అలాంటి తెలంగాణ ద్రోహులకు ఓటు వేసి గెలిపిస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన రోజు తనకు అన్నం తినాలనిపించలేదన్న పవన్‌కల్యాణ్‌తో పొత్తు ఎలా పెట్టుకున్నారని నిలదీశారు.
సీఎం కేసీఆర్ అంటే నమ్మకం కాంగ్రెస్ అంటే నాటకమని, రాష్ట్రం కేసీఆర్ చేతిలోనే భద్రంగా ఉంటుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న హుజూరాబాద్ ప్రాంతవాసుల ఆత్మగౌరవాన్ని ఈటల మంటగలిపారని ధ్వజమెత్తారు. ఏం చేసినా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం తథ్యమని దీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డి, గజ్వేల్‌లో సీఎం కేసీఆర్ లక్ష ఓట్ల ఆధిక్యతతో గెలుపు ఖాయమని.. ఈటల మాత్రం రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతారని మండిపడ్డారు.