సిద్దిపేట జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు లేఖ రాశారు. యాసంగి సాగు కోసం రంగనాయక సాగర్‌ను నింపాలని లేఖలో కోరారు. శనివారం శాసనసభలోనూ మంత్రిని కలిసిన ఆయన యాసంగికి సాగునీటి విడుదలపై చర్యలు తీసుకోవాలని కోరిన విషయం తెలిసిందే.
గత మూడేళ్లుగా జిల్లాలో సాగు భూములకు రంగనాయక సాగర్ ద్వారా సాగునీటిని అందిస్తూ వచ్చామని హరీశ్ రావు తెలిపారు. దీంతో పంట దిగుబడి పెరిగి రైతుల బతుకుల్లో సంతోషం నిండిందని.. ఈ ఏడు వర్షాభావ పరిస్థితుల వల్ల యాసంగికి సరిపడా నీటి నిల్వలు జలాశయంలో లేకపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. యాసంగికి నీళ్లు అందించాలంటే జలాశయంలో కనీసం మూడు టీఎంసీలైనా నిల్వ ఉండాలని చెప్పారు. ప్రస్తుతం 1.50 టీఎంసీల జలాలు మాత్రమే ఉన్నందున మధ్య మానేరు నుంచి ఎత్తిపోయాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.