తెలంగాణ కంటే 22 రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు తీసుకున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కర్ణాటక, రాజస్థాన్ కూడా మనకంటే ఎక్కువే అప్పులు తీసుకున్నాయని చెప్పారు. ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రాష్ట్రానికి రాలేదని తెలిపారు. కేపిటల్ వ్యయాన్ని నివేదికలో చూపించలేదని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఆస్తుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. ఎస్పీవీ రుణాల వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడదని స్పష్టం చేశారు.ఎస్పీవీ రుణాలు సంబంధిత సంస్థలే చెల్లిస్తాయని పేర్కొన్నారు.రాష్ట్రం దివాళా తీసింది అని ప్రచారం చేస్తే.. పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. సొంత ఆదాయ వనరుల వృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపామని వివరించారు.
“15.6 శాతం వృద్ధిరేటుతో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపాం. ఆరోగ్య రంగంలో వ్యయాన్ని ఆరు రెట్లు పెంచాం. కేంద్రం నుంచి రావాల్సిన డబ్బు రూ.లక్ష కోట్ల వరకూ ఆగిపోయింది. ఎస్పీవీల ద్వారా తీసుకున్న రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా చూపే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం హామీ లేని రుణాలను కూడా ప్రభుత్వ అప్పుగా చూపించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని వాటిని కూడా చెల్లించాలని తప్పుగా చూపించారు. ఈ శ్వేతపత్రం.. ఒక తప్పుల తడక, అంకెల గారడీ. గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెదుక్కుంటున్నారు.” అని శాసనసభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.