తెలంగాణ బడ్జెట్ సమావేశాలు పదో రోజు కొనసాగుతున్నాయి. పద్దులపై ఇవాళ చివరి రోజు చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీలో వాగ్వాదం చోటుచేసుకుంది. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. సుప్రీంకోర్టులో ఉన్న ఎమ్మెల్యే ఫిరాయింపుల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించడం సరికాదని హరీష్ రావు అన్నారు.
హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ వ్యవహారంపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు స్పందించారు. పార్లమెంటులో న్యాయవ్యవస్థపై కూడా చర్చలు జరుగుతాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు బయట చేసే వ్యాఖ్యలను మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించారని.. అంతకుమించి ఆ వ్యవహారంపై ఆయన మాట్లాడలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంత్రుల వ్యాఖ్యలతో శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనకు అవకాశం ఇవ్వాలని పట్టుపట్టారు.