తెలంగాణలో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్న అంశం రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లిలోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల వ్యవహారం. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. HCUలో వేలాది చెట్లను ధ్వంసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
“ఒక్క చెట్టు కొట్టాలన్నా అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. చెట్లు నరకడానికి రక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కంచే చేను మేసినట్టుగా ప్రభుత్వ తీరు ఉంది.
50 బుల్డోజర్లను పెట్టి చెట్లను ఊచకోత కోశారు. ప్రభుత్వ చర్యలతో 3 జింకలు చనిపోయాయి. ఒక్క జింకను చంపినందుకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను జైలులో పెట్టారు. మరి 3 జింకల చావుకు సీఎం రేవంత్ కారణం కాదా..? పేదవాడు ఒక్క చెట్టు కొడితే కేసులు పెడతారు. వేలాది ఎకరాలను కొట్టేస్తుంటే..
అధికారులు నిద్రపోతున్నారా..? ఇది పూర్తిగా అటవీశాఖ నిర్లక్ష్యం. పట్టాభూమిలో చెట్టు కొట్టాలంటే అనుమతి అవసరం. ప్రభుత్వం ఎలాంటి అనుతులు తీసుకోకండా వేలాది చెట్లను కొట్టేసింది.” అని హరీష్ రావు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.