గత రెండ్రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో భద్రాచలం పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో సీతారామచంద్రస్వామి ఆలయ పరిసరాలు నీటిలో మునిగిపోయి రాకపోకలు స్తంభించాయి. అన్నదాన సత్రానికి ఇరువైపులా నీరు చుట్టుముట్టి లోనికి చేరింది. సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలో గుట్టపై ఉన్న వందేళ్ల కట్టడం కుసుమ హరనాథ్ బాబా ఆలయ కల్యాణ మండపం కుంగిపోవడంతో ఏక్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని భావించిన అధికారులు దాన్ని కూల్చివేశారు.
ఇక భద్రాచలం పట్టణంలో వరద నీరు ఇళ్లలోకి చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. ఆలస్యంగా మేలుకున్న అధికారులు చర్యలు చేపట్టినా అప్పటికే ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. విస్తా కాంప్లెక్స్, కొత్త కాలనీల వద్ద కరకట్ట స్లూయిస్‌లను తెరిచి మోటార్లతో నీటిని తోడి గోదావరిలోకి తరలించడంతో మధ్యాహ్నం కల్లా రామాయలం పరిసరాలతో పాటు కొత్తకాలనీలో వరద సమస్య తగ్గిపోయింది. కానీ వర్షం పడిన ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.