రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానకు రాష్ట్రంలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జంట జలాశయాల్లో క్షణక్షణానికి నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నీటిమట్టం పెరుగడంతో.. హిమాయత్ సాగర్ జలాశయం మరో రెండు గేట్లు ఎత్తనున్నట్లు జల మండలి తెలిపింది.
హిమాయత్ సాగర్‌కు 1600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయం నుంచి మూసీలోకి 2,750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1763.50 అడుగులుగా నమోదైంది. ఉస్మాన్ సాగర్‌కు 800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
మరోవైపు ఉస్మాన్ సాగర్‌లోనూ భారీగా వరద ప్రవాహం చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1,785.65 అడుగులుగా నమోదైంది. మరోవైపు హైదరాబాద్ నగరంలో ఇవాళ తెల్లవారు జాము నుంచి వర్షాలు లేకపోయినా.. వరద ముప్పు మాత్రం అలాగే ఉంది. ఇంకా నగరంలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.