తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రోజున పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించడానికి మార్కెట్‌కు తీసుకువస్తే.. అకాల వర్షానికి కొట్టుకుపోయిందని ఆవేదన చెందారు. వర్ధన్నపేట మండలం ఇల్లంద, కట్య్రాల, ఉప్పరపల్లి, వర్ధన్నపేట, డీసీ తండా, దమ్మన్నపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని వందల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ఇల్లందలోని మార్కెట్ యార్డులో ఆరబోసిన సుమారు 150 క్వింటాళ్ల ధాన్యం రాశులు కొట్టుకుపోయాయి.
మహబూబాబాద్ జిల్లాలో సుమారు రెండు గంటల పాటు భారీ వర్షం పడటంతో ఏజెన్సీ మొత్తం విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కొత్తగూడ మండలం మైలారంలోని గాంధీనగర్‌లోని కొనుగోలు కేంద్రంలో సుమారు 300 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు అత్యధికంగా హనుమకొండ జిల్లా ఆత్మకూరులో 13, శాయంపేటలో 12 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 11, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 9, హనుమకొండలో 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.