తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని చెప్పారు. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు గురువారం (జూన్ 13వ తేదీ) ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించారు. బొమ్మలరామారంలో 6.9 సెం.మీ. ఇంకోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.