ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, ‘రెరా’ మాజీ కార్యదర్శి శివబాలకృష్ణ 8 రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది. శివబాలకృష్ణ బినామీల పేరిట 2వందల 14 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించాకు. ప్రధానంగా ముగ్గురు బినామీలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు…అతని సోదరుడు శివనవీన్‌ను కూడా కస్టడీకి తీసుకుంటామని తెలిపారు. శివబాలకృష్ణ పేరిట 7 ఇళ్లు, ఒక విల్లా, అతని కుటుంబం పేరిట 29 ప్లాట్లు, జనగామలో 102 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా అతని పేరిట 250 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు రేపటితో శివబాలకృష్ణ జ్యుడీషియల్ రిమాండ్ ముగియనుంది. అయితే ఈ కేసులో మరిన్ని అవినీతి తిమింగలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు భావిస్తున్నారు. చాలా వరకు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతర బినామీల పేరిట ఆస్తులు ఉన్నట్లు విచారణలో గుర్తించామని అధికారులు తెలిపారు.