రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విస్తృత తనిఖీల్లో భారీగా నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది. హైదరాబాద్ ఫిలింనగర్ నారాయణమ్మ కళాశాల వద్ద కారులో రూ.30 లక్షల నగదు పట్టుబడింది. ఈ నగదుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఛాదర్‌ఘాట్ క్రాస్‌రోడ్‌లో 9 లక్షలు… పురానాపూల్ గాంధీ విగ్రహం సమీపంలో యాక్టీవాలో తరలిస్తున్న 15లక్షలు.. చందానగర్ ఠాణా పరిధిలో ఐదున్నర కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ అబ్దుల్ అనే వ్యక్తి నుంచి 5 లక్షలు, దినేష్ నుంచి 12 లక్షల నగదు.. నిజాం కళాశాల వద్ద తనిఖీల్లో అబిడ్స్ పోలీసులకు కారులో తరలిస్తున్న ఏడున్నర కోట్ల విలువైన 7కిలోల బంగారం, 295 కిలోల వెండి పట్టుబడింది.
ఇక తాజాగా హైదరాబాద్ చైతన్యపురి పీఎస్ పరిధిలో రూ.25 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీలు చేస్తుండగా ఈ నగదు పట్టుబడగా.. సరైన ఆధారాలు చూపించకపోవడంతో నగదు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మం. మట్టపల్లి చెక్‌పోస్ట్ వద్ద తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న రూ.1.90 లక్షల నగదు పట్టుబడింది.