తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి పరువు నష్టం కేసులో నోటీసులు జారీ చేసింది హైదరాబాద్ కోర్టు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సీఎంపై ఫిర్యాదు చేసారు. మే 4వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల సమావేశంలో బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయబోతోందని రేవంత్ రెడ్డి తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ వెంకటేశ్వర్లు స్థానిక కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు.
అయితే మే 17న ఈ అంశం మొదటిసారిగా విచారణకు రాగా, మేజిస్ట్రేట్ మే 22కి వాయిదా వేశారు. వెంకటేశ్వర్లు గైర్హాజరు కావడంతో మే 24న మళ్లీ జులై 3కి వాయిదా వేశారు. ఆ తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ వాయిదా ఉత్తర్వులను సవాల్ చేస్తూ వెంకటేశ్వర్లు తెలంగాణ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసారు. దాంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ఈ ఫిర్యాదును వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు మేజిస్ట్రేట్ మళ్లీ పిటిషన్‌పై విచారణ జరిపి తాజాగా రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు