చక్రవాత అవర్తనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండ్రోజుల పాటు భిన్న వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. రాష్ట్రంలో బుధ, గురువారాల్లో పగలు అధిక ఉష్ణోగ్రత.. రాత్రిపూట ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లగా ఉంటుందని వెల్లడించారు. రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి ప్రకటించారు.
తెలంగాణలో మంగళవారం రోజున తూర్పు జిల్లాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో బలంగా ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఈనెల 13, 14వ తేదీల్లో అది తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పింది. దీని ప్రభావం వల్ల వాతావరణంలో భిన్నమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. భిన్న వాతావరణం వల్ల ప్రజలు ఆనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది.