హైదరాబాద్ మెట్రో ఆదాయం అమాంతం పెరిగింది. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 105 శాతం పెరిగినట్లు ఆర్థిక నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా.. 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. 2022-23లో రూ.1315.99 కోట్లు నష్టపోయిన ఆ సంస్థ… గతేడాది రూ.555.04 కోట్లకు తగ్గినట్లు నివేదికలో పేర్కొంది. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయని వివరించింది.
గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా రూ.611.48 కోట్ల ఆదాయం రాగా.. టీవోడీ ద్వారా రూ.796.33 కోట్లు వచ్చాయని మెట్రో అధికారులు తెలిపారు. అద్దెల ద్వారా రూ.110.42 కోట్లు, ప్రకటనల ద్వారా రూ.81.06 కోట్లు, ఇతరత్రా రూ.82.77 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు ఎల్ అండ్ టీ మెట్రోకి ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని భూమిని స్లంప్‌సేల్ రూపంలో రహేజా గ్రూప్, బ్రూక్‌ఫీల్డ్ కార్పొరేషన్‌కు బదిలీ చేయడం ద్వారా మొదటి విడతగా రూ.511.73 కోట్లు అందడంతో ఆదాయం పెరిగినట్లు చెప్పారు.