హైదరాబాద్ పోలీసుల తీరుపై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ‘నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీఛార్జి పోలీస్’ అంటూ నగరంలో నేరాల కట్టడికి ఒక ఠాణా పరిధిలో పోలీసులు చేసిన ప్రకటనపై ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందిస్తూ దీన్ని తప్పుబట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపైకి చేరి వాహనాలతో బెంబేలెత్తిస్తున్న గుంపును ఉద్దేశించి ‘నో ఫ్రెండ్లీ పోలీస్, లాఠీఛార్జి పోలీస్’ అంటూ పోలీసులు మైక్ ద్వారా హెచ్చరించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ వీడియో కాస్తా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దృష్టికి వెళ్లగా ఆయన దాన్ని ఎక్స్‌లో పోస్టు చేసి పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఇలా జూబ్లీహిల్స్‌లో చేయగలరా! అని ప్రశ్నించిన ఒవైసీ.. ఇతర మెట్రో నగరాల మాదిరి ఇరానీ ఛాయ్ హోటళ్లు, పాన్‌దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కార్యకలాపాలను అర్ధరాత్రి 12 గంటల వరకూ తెరచి ఉంచేలా అనుమతించాలని కోరారు.